ఆకస్మికంగా .. ముస్తపల్లె రైతుసేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్
రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి… నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆత్మకూరు మండలం, ముస్తపల్లె గ్రామంలోని రైతు సేవా కేంద్రం, వసుంధర ఎరువుల దుకాణంలో నిల్వ ఉంచిన యూరియా నిల్వలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సరిపడా యూరియా అందజేయడం జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు పంటకు సరిపడా యూరియా మాత్రమే వాడాలని యూరియాను అధిక మోతాదులో వాడి పంట దిగుబడి కోల్పోరాదన్నారు. ప్రభుత్వం ఏ సీజన్ కు సంబంధించి ఆ సీజన్లో రైతులకు సరిపడా యూరియా అందజేయడం జరుగుతుందని రైతులు రబి సీజన్ కు సంబంధించి ముందుగానే యూరియా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతుల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా యూరియా సక్రమంగా సరఫరా చేయాలని ఆర్ఎస్కే సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హేమలత, రైతు సేవా కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.