భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారిద్దాం’..

V POWER NEWS  .. ADONI :    సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషిచేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సబ్ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం డివిజన్ లోని స్కానింగ్ నిర్వాహకులు, ప్రైవేట్, ప్రభుత్వ వైద్య అధికారులకు, మరియు సంబంధిత అధికారులతో , సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… తల్లిందండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారానే భ్రూణ హత్యలను నివారించగలమన్నారు. రానున్న రోజుల్లో గర్భస్థ శిశువులపై లింగ వివక్షకు వ్యతిరేకంగా, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కలిగించాలని నిర్ణయించారు. లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. పీసీ పీఎన్డీటీ చట్టం ప్రకారం స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం ఉందన్నారు.ఆదోని డివిజన్ పరిధిలో 48 స్కానింగ్ కేంద్రాలు ఉండగా. డివిజన్లో ఉన్న స్కానింగ్ కేంద్రాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేసి నూతన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్, సిబ్బంది, చిరునామా, పరికారాల్లో మార్పులు వంటి అంశాలపై తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా స్కానింగ్ సెంటర్లను అనుమతులు రద్దు చేయాలన్నారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి హేమలత మాట్లాడుతూ…భ్రూణ హత్య అనేది సమాజానికి కలిగే తీవ్ర అనర్థం మాత్రమే కాకుండా, చట్టపరంగా కూడా నేరం. గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ చేసి, ఆడ శిశువులను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం మన సమాజం ఎదుట ఉన్న సవాలుగా మారింది. భారతదేశంలో “పురుష-స్త్రీ నిష్పత్తి” అసమతుల్యతకు ప్రధాన కారణంగా భ్రూణ హత్యలు ఉన్నాయి. ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. “భ్రూణ హత్య నిషేధ చట్టం – 1994 (PCPNDT Act)” ప్రకారం, గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ చేయడం మరియు భ్రూణ హత్య చేయడం చట్టబద్ధంగా నిషేధించబడింది. ఆడ పిల్లల తల్లిదండ్రులుకు చదువు యొక్క విలువలను తెలియజేసి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని వారిని ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా వారికి అవగణ కల్పించాలని సంబంధిత అధికారులకు డి.ఎస్.పి హేమలత సూచించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి మాట్లాడుతూ…లింగ నిర్ధారణ చేయకుండా ఉండటం – వైద్యులు ఎవరూ గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించరాదన్నారు. నైతిక వైద్య సేవలు అందించడం – పేదరికం, కుటుంబ ఒత్తిళ్ల వలన భ్రూణ హత్యకు ఒత్తిడి ఎదుర్కొనే తల్లులకు మానసిక, వైద్య పరమైన సలహా అందించాలన్నారు. చట్టాన్ని కఠినంగా పాటించడం – PCPNDT చట్టాన్ని ఉల్లంఘించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.సామాజిక అవగాహన పెంచడం – భ్రూణ హత్యల హానికారక ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల ప్రాముఖ్యతను గుర్తించడం – బాలికల హక్కులను ప్రోత్సహిస్తూ, “బేటీ బచావో – బేటీ పడావో” వంటి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ఈ సమావేశంలో డి.ఎస్.పి హేమలత, డిప్యూటీ డి.యం.హెచ్.వో డాక్టర్ సత్యవతి, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, డెమో అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ డెమో అధికారి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా మానిటరింగ్ కన్సల్టెంట్ అధికారి సుమలత, సిడిపిఓస్ సఫర్ నిషా బేగం, ఉమ మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!