నేడు రావణవాహన సేవలో దర్శనమివ్వనున్న స్వామి అమ్మవార్లు …


శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు శనివారం రోజున శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. ఆనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి మయూర వాహనంపై ఆశీనులను చేశారు. ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. మయూర వాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం. శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజారికాలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి క్షేత్రపుర వీదుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి. డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
