V POWER NEWS : కర్నూలు జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాaలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ఆయా శాఖల అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు, ఇతర కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం లేకుండా చూడాలన్నారు. ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే దాచి పెట్టవద్దని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలు, టోల్ ఫ్రీ నంబర్ వివరాలతో శాశ్వతంగా ఉండే విధంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. పొలాల్లో గంజాయి సాగు గురించి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వీఆర్వోల ద్వారా సమాచారం తీసుకుని పోలీసు శాఖకు అందించాలని ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. ఎక్సైజ్, అటవీ శాఖ అధికారులు కూడా గంజాయి సాగు, మత్తు పదార్థాల వినియోగం పట్ల నిఘా ఉంచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, ప్రతిజ్ఞల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మిరప పంట మధ్యలో గంజాయి సాగు చేసే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు గంజాయి సాగు చట్ట పరంగా నేరమనే విషయాన్ని పూర్తిగా అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. బస్సులు, రైళ్ల ద్వారా వీటి రవాణాను పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మత్తు పదార్థాల వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.