వర్కింగ్ క్యాపిటల్ ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం .. సులభతర ప్రభుత్వ అనుమతులకు త్వరితగతిన చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. అనంతరం మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై యువ పారిశ్రామికవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు చేయూతను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే పెట్టుబడి సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కూడా సులభతరంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం హార్టికల్చర్, పసుపు, సుగంధ ద్రవ్యాలు, పూలు, పండ్ల మొక్కల పెంపకం ఎక్కువ శాతం చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారుగా 33 శాతం అటవీ ప్రాంతం ఉండగా, 1/3 వంతూ సాగు భూమి ఉండగా, అందులో ఎక్కువ శాతం వరి, జొన్న తదితర పంటలను పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల సోనా బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. అదే విధంగా పశు సంపద కూడా జిల్లాలో సమృద్ధిగా ఉందన్నారు. జిల్లాలోని బనగానపల్లె, డోన్ ప్రాంతాల్లో 90 శాతం సున్నపు రాయి పరిశ్రమలతో పాటు 10 శాతం ఇనుప ఖనిజం లవణాలు ఉండడం వల్ల మైనింగ్ కార్యకలాపాలు నిర్వహణకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి పెరుగుదలకు గాను వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా 42 శాతం, సేవా రంగాలకు 39 శాతం, పరిశ్రమల పరంగా 19 శాతం ద్వారా సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. సదరు సంస్థల ఏర్పాటుకు బ్యాంకర్స్ వైపు నుండి కూడా పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిఎం ఎస్.మహబూబ్ బాషా, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, కార్మిక శాఖ సహాయక కమీషనర్ బషీర్రునిస్సా బేగం, కాలుష్య నియంత్రణ సంస్థ ఈఈ కిషోర్ రెడ్డి, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.